హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో ఫిబ్రవరి 11 నుంచి మళ్లీ ఫార్ములా ఈ రేస్ కార్ల సందడి వుండబోతోంది. దీనికి సంబంధించిన టిక్కెట్లను నిర్వాహకులు విడుదల చేశారు. 1000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకూ టిక్కెట్లు అందుబాటులో వున్నాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రత్యేక సీఎస్ అరవింద్ కుమార్ హాజరై, టిక్కెట్లను విడుదల చేశారు. ఈ రేసింగ్ ని చూసేందుకు సాధారణ ప్రజానీకానికి కూడా అనుమతి వుంటుందని నిర్వాహకులు ప్రకటించారు. ఇప్పటికే బుక్ మై షోలో ఈ టిక్కెట్లు అందుబాటులోకి వచ్చేశాయి. ఈ రేసింగ్ ఈవెంట్ లో 11 టీమ్స్, 22 కార్లు పాల్గొంటాయి. ప్రేక్షకుల కోసం 22 వేల కెపాసిటీతో గ్యాలరీ సిద్ధం చేశారు. రేసింగ్ సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు ప్రకటించారు.

భద్రతాపరంగా తగిన చర్యలు తీసుకుంటున్నామని నిర్వాహకులు తెలిపారు. ఫిబ్రవరి 11 నుంచి ఈ ఫార్ములా ఈ రేసింగ్ ప్రారంభం కానుంది. 10 వ తేదీన ప్రాక్టీసింగ్ రేసింగ్ వుంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ మాట్లాడుతూ… టాప్ 2 నగరాల్లో ఒకటిగా నిలిచేందుకు హైదరాబాద్ ప్రయత్నిస్తోందన్నారు. వరల్డ్ గ్రీన్ సిటీగా హైదరాబాద్ అవార్డు దక్కించుకుందని, ఈ ఫార్ములా రేస్ జరగడానికి ఇది కూడా ఓ కారణమేనని వివరించారు. హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేసి, లైవ్ ప్రసారం చేస్తామని అరవింద్ కుమార్ ప్రకటించారు.