రోమన్ క్యాథలిక్కుల మత గురువు మాజీ పోప్ బెనెడిక్ట్ కన్నుమూశారు. ఆయన మృతి చెందినట్టు వాటికన్ సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. బెనెడిక్ట్ వయసు 95 సంవత్సరాలు. కొన్ని రోజులుగా బెనెడిక్ట్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. హృద్రోగ సమస్యతో పాటు ఇతర వ్యాధులకు కూడా చికిత్స తీసుకుంటున్నారు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ప్రాణాలు వదిలినట్టు వాటికన్ సిటీ ప్రతినిధులు వెల్లడించారు. జనవరి 2 నుంచి సెయింట్ పీటర్స్ బేసిలికా వద్ద పోప్ భౌతికకాయాన్ని ఉంచుతామని తెలిపారు. ప్రస్తుత పోప్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో గురువారం సెయింట్ పీటర్ స్క్వేర్లో బెనెడిక్ట్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
జర్మనీలో జన్మించిన బెనెడిక్ట్ అసలు పేరు జోసెఫ్ రాట్జింగర్. 78 ఏళ్ల వయసులో 2005లో పోప్గా ఎన్నికయ్యారు. 16వ బెనెడిక్ట్ణను తన పేరుగా ఎంచుకున్నారు. అయితే ఎనిమిదేళ్లు కూడా పూర్తవకుండానే 2013లో రాజీనామా చేశారు. క్యాథలిక్ చర్చిని నడిపే శక్తి తనకు లేదని ప్రకటించారు. 600 ఏళ్ల చరిత్రలో రాజీనామా చేసిన తొలి పోప్ బెనెడిక్టే కావడం విశేషం. బెనెడిక్ట్ పోప్గా ఉన్న కాలంలో క్యాథలిక్ చర్చి పలు ఆరోపణలు, న్యాయ వివాదాలను ఎదుర్కొంది. పలు దేశాల్లో దశాబ్దాల పాటు పలువురు మతాధికారులు చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడ్డారన్న అంశంపై అధికారిక నివేదికలు వెలుగుచూశాయి. కాగా, బెనెడిక్ట్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన చిరస్మరణీయుడని పేర్కొన్నారు.












