భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ టీఆర్ ఎస్ కి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బండి సంజయ్ తో కలిసి ఢిల్లీ వెళ్లిన నర్సయ్య గౌడ్… బీజేపీ తెలంగాణ ఇంచార్జీ తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, జి. కిషన్ రెడ్డితో పాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు డా. కే. లక్ష్మణ్, బీజేపీ తెలంగాణ ఇంచార్జి తరుణ్ చుగ్, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ సమక్షంలో డా. బూర నర్సయ్య గౌడ్ బీజేపీ కేంద్ర కార్యాలయంలో కాషాయ కండువా కప్పుకున్నారు. బూర నర్సయ్యతో పాటు వడ్డేపల్లి రాజేశ్వరరావు, రవి ప్రకాశ్ యాదవ్, హరిశంకర్ గౌడ్ సహా మొత్తం 16 మంది టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలను తనతో పాటు బీజేపీలో చేర్పించారు. పార్టీ సభ్యత్వ నమోదు రసీదును బూర నర్సయ్యకు కేంద్ర మంత్రులిద్దరూ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నర్సయ్య గౌడ్ ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిష్పక్షపాతంగా పనిచేయడమే తన ప్రధాన కర్తవ్యమని ఆయన చెప్పారు. తాను ఎంపీగా పనిచేసిన ఐదేళ్ల కాలంలో ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి పనులను భువనగిరికి తీసుకువచ్చానని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ సమీపించిన నేపథ్యంలో ఈ పరిణామం బీజేపీకి కలిసి వస్తుందన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి.