జార్ఖండ్ లో భారీ ఎన్ కౌంటర్… ఐదుగురు నక్సలైట్ల హతం

జార్ఖండ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పలాంచత్రా సరిహద్దులో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇందులో ఐదుగురు నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఐదుగురిలో ఒకరిపై భారీ రివార్డు కూడా వుంది. ఆ రివార్డు నక్సలైట్ కూడా మరణించాడు. పలాం చత్రా ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం అందుకున్న సీఆర్పీఎఫ్ బలగాలు ఆ ప్రాంతంలో ఆపరేషన్ నిర్వహించారు.

 

ఈ సమయంలో ఎదురు కాల్పులు జరిగాయి. ఘటనా స్థలంలో రెండు ఏకే 47 తుపాకులతో సహా… పెద్ద మొత్తంలో ఆయుధాలు లభించాయి. నక్సల్స్ ముఠాకి చెందిన స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు గౌతమ్ పాసవాన్ ఈ ఎన్ కౌంటర్ లో హతమైనట్లు అధికారులు ప్రకటించారు. అయితే… ఇందులో మరణించిన నక్సలైట్లపై రివార్డులు కూడా వున్నాయి. ఓ నక్సలైట్ పై 25 లక్షల రివార్డు, మరో నక్సలైట్ పై 5 లక్షల రివార్డు వుంది.

 

వామపక్ష తీవ్ర వాదంపై పోరాటం చివరి దశలో వుందని, విజయానికి అత్యంత చేరువలోనే వున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. వామపక్ష తీవ్రవాదాన్ని తుదముట్టించడంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది పాత్రను మరిచిపోలేమని అన్నారు. ఛత్తీస్ గఢ్ లో జరిగిన CRPF 84 వ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమంలో ప్రసంగించారు. బస్తర్ ప్రాంతంలో మొట్ట మొదటి సారిగా CRPF వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఎంతో ఆనందంగా వుందన్నారు.

 

9 సంవత్సరాలుగా సీఆర్పీఎఫ్ సిబ్బంది మావోయిస్టులకు వ్యతిరేకంగా పెద్ద పోరాటమే చేస్తున్నారని, పోరాటం చేస్తున్న ప్రతిసారీ విజయం సాధిస్తూ వస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధికి కలుగుతున్న సవాళ్లు, అవాంతరాలను కూడా తొలగించడంలో కీలక పాత్ర పోషించారన్నారు. 2010 తో పోల్చితే వామపక్ష తీవ్రవాద హింసాత్మక ఘటనలు 76 శాతం తగ్గాయని, ప్రాణనష్టం కూడా 78 శాతం తగ్గిందని అమిత్ షా ప్రకటించారు.

Related Posts

Latest News Updates