సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్‌పేట డెక్కన్ స్టోర్‌లో చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రావడం లేదు. దాదాపు ఆరు గంటలు కావొస్తున్నా అగ్నికీలలు ఇంకా ఎగిసిపడుతూనే ఉన్నాయి. మంటల తీవ్రత ఎక్కువగా వుండటంతో రెస్క్యూ సిబ్బందికి ఆపరేషన్ బాగా కష్టంగా మారింది. మంటలను ఆర్పేందుకు దాదాపు 25 ఫైరింజన్లను అధికారులు రంగంలోకి దింపారు. భవనం మూడు వైపులా మోహరించి, మంటలను అదుపు చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా… మంటలు అదుపులోకి రావడం లేదు. ఈ సమయంలోనే పొగ కారణంగా ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు అధికారులు.
భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో రెస్క్యూ ఆపరేషన్ కష్టంగా మారుతోంది. ముందస్తు చర్యలో భాగంగా ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపేశారు. ప్రాణనష్టం జరుగకుండా చుట్టుపక్కల వారిని ఖాళీ చేయిస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే బిల్డింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు. భవనం ఏక్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉందని జీహెహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ చీఫ్ కంపాటి విశ్వజిత్ ప్రకటించారు. మరో వైపు ఘటనా స్థలాన్ని తెలంగాణ హోంమంత్రి మెహమూద్ అలీ సందర్శించారు. ప్రమాదానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పుతున్నట్లు హోంమంత్రి చెప్పారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాక పరిస్థితిని సమీక్షించి నష్టపోయిన వారిని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ప్రకటించారు.