ప్రముఖ నటి జయప్రదకు షాకిచ్చిన కోర్టు..15 రోజుల్లోగా లొంగిపోవాలంటూ ఆదేశం!

ఉద్యోగులకు ఈఎస్ఐ చెల్లింపుల్లో అవకతవకల కేసులో తనకు విధించిన జైలు శిక్షను రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించిన ప్రముఖ నటి జయప్రదకు చుక్కెదురైంది. 15 రోజుల్లోగా కోర్టులో లొంగిపోవాలని శుక్రవారం ఆదేశించిన మద్రాస్ హైకోర్టు రూ.20 లక్షలు కూడా డిపాజిట్ చేయాలంటూ తీర్పు వెలువరించింది. 

కేసు పూర్వాపరాల్లోకి వెళితే, చెన్నైకి చెందిన రామ్‌కుమార్, రాజ్‌బాబులతో కలిసి జయప్రద అన్నాసాలైలో గతంలో ఓ థియేటర్ నిర్వహించారు. ఆ సమయంలో సిబ్బందికి ఈఎస్ఐ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఎగ్మూర్ కోర్టులో కేసు దాఖలైంది. ఈ క్రమంలో న్యాయస్థానం జయప్రద సహా ముగ్గురికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ ఆగస్టులో తీర్పు వెలువరించింది. 

ఈ తీర్పును సవాలు చేస్తూ జయప్రద హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు. పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి, ఈఎస్‌ఐ బాకీ కింద రూ.37.28 లక్షలు చెల్లించడం కుదురుతుందా? లేదా? అనే విషయంలో స్పష్టత ఇవ్వాలని జయప్రదను కోరారు. రూ.20 లక్షలు చెల్లిస్తానని ఆమె చెప్పగా ఈఎస్ఐ తరపు న్యాయవాది వ్యతిరేకించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం శుక్రవారం జయప్రద పిటిషన్ కొట్టేస్తూ తీర్పు వెలువరించింది.

Related Posts

Latest News Updates