కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పుల దిశగా కసరత్తు తుదిదశకు చేరుకుంది. కీలకమైన శాఖలు మినహా దాదాపు అన్ని శాఖల్లోనూ మార్పులు జరుగుతాయని తెలుస్తోంది. నిజానికి కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయని, ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న రాష్ట్రాల నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం పెరుగుతుందని చాలా రోజుల క్రితం నుంచే కథనాలు, ఊహాగానాలు వెలువడ్డాయి. నిజానికి ఒకట్రెండు నెలల ముందే జరగాల్సిన ఈ కసరత్తును శుభదినాలుగా భావించే ఉత్తరాయణ కాలంలో చేపట్టాలని అధినేతలు భావించినట్టుగా తెలిసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడుతున్న వేళ ఈ కసరత్తును వెంటనే అమలు చేస్తారా లేక, బడ్జెట్ సమావేశాల మధ్యలో విరామ సమయంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను చేపడతారా అన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే కసరత్తు మాత్రం దాదాపుగా పూర్తయిందని, ఎవరెవరికి ఉద్వాసన పలకాలో వారికి సమాచారం కూడా ఇచ్చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.