ప్రతి రాష్ట్రంలోనూ ఎన్ఐఏ శాఖలు… 2024 లోగా అందుబాటులోకి : అమిత్ షా కీలక ప్రకటన

ప్రతి రాష్ట్రంలో కూడా ఎన్ఐఏ శాఖలను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. 2024 లోగా అన్ని రాష్ట్రాల్లో ఎన్ఐఏ శాఖలను ఏర్పాటును పూర్తి చేసి తీరుతామని ప్రకటించారు. హర్యానాలోని సూరజ్ కుంద్ లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో రెండు రోజుల పాటు చింతన్ శిబిర్ ను ఏర్పాటు చేశారు. దీనిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇలాంటి చింతన్ శిబిర్ లు దేశంలో సైబర్ క్రైమ్, నార్కొటిక్స్, క్రాస్ బోర్డర్ టెర్రరిజం లాంటి నేరాల నియంత్రణకు ఉపయోగపడుతాయని తెలిపారు.

 

తమ ప్రభుత్వం సహకారం, సమన్వయం అన్న వాటితో పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. సైబర్ క్రైమ్స్, నార్కోటిక్స్, సీమాంతర ఉగ్రవాదం, దేశ ద్రోహం మున్నగు వాటిపై కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము-కశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలు 34 శాతం తగ్గిపోయాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. అలాగే భద్రాతా దళాల మరణాలు 64 శాతం, పౌరుల మరణాలు 90శాతం తగ్గాయని వెల్లడించారు.

 

 

ఇక… ఐపీసీ, సీఆర్ పీసీ కి సవరణ చేపట్టి పార్లమెంట్ ముందుకు బిల్లులు తీసుకొస్తామని అమిత్ షా కీలక ప్రకటన చేశారు. సవరణలకు సంబంధించి రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున సూచనలు వచ్చాయని, వీటిని నిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. 2024 లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉగ్రవాద, తీవ్రవాద కార్యకలాపాలు తగ్గాయని ప్రకటించారు. ఇక… వామపక్ష తీవ్రవాద నిర్మూలనలోనూ విజయం సాధించామని, 2014 తర్వాత హింసలో 77 శాతం మృతుల సంఖ్యలో 87 శాతం తగ్గుదల నమోదైందన్నారు. 2014 లో 113 జిల్లాలు వామపక్ష ఉగ్రవాదం ప్రబలంగా వుండేదని, వాటి సంఖ్య 46 కి తగ్గిందన్నారు.

Related Posts

Latest News Updates