విపక్షాలను ఈడీ ఏకం చేస్తోంది : ప్రధాని నరేంద్ర మోదీ

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ లోకసభలో కీలక ప్రసంగం చేశారు. తన జీవితాన్ని దేశం కోసమే అంకితం చేశానని, ప్రజలకు తనపై పూర్తి విశ్వాసం వుందని ప్రకటించారు. ఆ విశ్వాసం విపక్షాలకు ఏమాత్రం అందదన్నారు. 140 కోట్ల మంది ప్రజల ఆశీర్వాదమే తనకు రక్ష అని, ఈ రక్షణ కవచాన్ని ఛేదించుకొని విపక్షాలు రాలేవని ధీమా వ్యక్తం చేశారు. 50 సంవత్సరాలుగా తాను ప్రజా జీవితంలోనే వున్నానని, పేదల కష్టాల గురించి పూర్తిగా తెలుసన్నారు. తాను 25 కోట్ల కుటుంబాల సభ్యుడినని, ఆ 25 కోట్ల కుటుంబాలకు సేవ చేస్తున్నానని పేర్కొన్నారు. కానీ కొందరు ఒకే కుటుంబానికి సేవ చేస్తారని పరోక్షంగా కాంగ్రెస్ కి చురకలంటించారు. తనపై బురద జల్లి లబ్ధి పొందాలని విపక్షాలు అనుకుంటాయని, పేపర్లు, టీవీల్లో విమర్శించి, లబ్ధి పొందలేరని మోదీ తేల్చి చెప్పారు.

 

నేడు  అనేక దేశాలను నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వేధిస్తున్నాయని, భారత్ మాత్రం ఐదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా నిలిచిందన్నారు. భారత్‌లో ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం చూసి కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని మోదీ చురకలు వేశారు. గత 9 సంవత్సరాలుగా విపక్ష నేతలు ఆలోచన లేకుండా ఆరోపణలే చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్బీఐ, ఈసీ, సైన్యంపై ఇష్టానుసారంగా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణాత్మక విమర్శలను తాము స్వాగతిస్తామని స్పష్టం చేశారు. నేడు విపక్ష నేతలు దేశం కోసం ఐక్యం కావడం లేదని, ఈడీ వల్లే ఒక్కటవుతున్నారని ఎద్దేవా చేశారు. విపక్షాలను ఈడీ ఏకం చేస్తోందని వ్యాఖ్యానించారు.

దేశంలో రోడ్లు, హైవేలు, రైల్వేలు గణనీయంగా డెవలప్ అయ్యాయని పేర్కొన్నారు. ఒకప్పుడు రైల్వేలుఅంటే యాక్సిడెంట్లు గుర్తుకు వచ్చేవి, ఇవాళ వందే భారత్ రైలును చూసి భారతీయులు గర్వపడుతున్నారని పేర్కొన్నారు. దేశాన్ని ముందుకు నడిపిస్తోంది మధ్యతరగతి కుటుంబాలేనని, ఈ కుటుంబాలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం మధ్య తరగతి నిజాయితీని గుర్తించిందని ప్రకటించారు. 2020 నుంచి 2030 దశాబ్దాల కాలం ఇండియా డికేడ్ గా ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుందని ప్రకటించారు.

Related Posts

Latest News Updates