మునుగోడు బైపోల్ లో బీజీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన రాజగోపాల్ రెడ్డి కి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నోటీసులు ఇచ్చింది. కోమటిరెడ్డి తన కంపెనీ ఖాతాల నుంచి 5 కోట్ల 24 లక్షల రూపాయలను ఎవరికి పంపారో వివరాలు ఇవ్వాలంటూ ఆదేశాలిచ్చింది. ఇవ్వాళ సాయంత్రం 4 గంటల లోపే వివరణ ఇవ్వాలని డెడ్ లైన్ విధించింది. ఒకవేళ వివరణ ఇవ్వకపోతే.. ఆయనపై తగు నిర్ణయం తీసుకుంటామని కూడా స్పష్టం చేసింది.
కోమటిరెడ్డికి చెందిన సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ కంపెనీ నుంచి మునుగోడులోని నేతలకు, సంస్థలకు కోమటిరెడ్డి నగదు బదిలీ చేసినట్లు టీఆర్ఎస్ నేత భరత్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. దాదాపు రూ.5.24 కోట్లను మునుగోడు నియోజకవర్గంలోని 23 మందికి చెందిన బ్యాంక్ ఖాతాలకు ట్రాన్స్ ఫర్ చేసినట్లు అందులో పేర్కొన్నారు. ఈ నగదుతో ఓటర్లను ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నట్లు ఆరోపించారు.