రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ పై కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పక్షాలతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి 8 జాతీయ పార్టీలు, 40 ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు హాజరై, తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ నమూనాను ప్రదర్శించింది. అయితే… దీనిపై అన్ని పార్టీలు అనుమానాలను వ్యక్తం చేశాయి. పార్టీలను పరిగణనలోకి తీసుకోకుండా మిషన్ ను ఎలా తయారు చేస్తారని ప్రశ్నించారు. ముందుగా తమ అభిప్రాయాలను వినాలని డిమాండ్ చేశాయి. రిమోట్ ఓటింగ్ పై ప్రతి రాష్ట్రంలో సమావేశాలు నిర్వహించాలని సూచించాయి. వలస ఓటర్లపై శాస్త్రీయత సర్వే లేకుండా వారిని ఎలా గుర్తిస్తారని ప్రశ్నించాయి. ఫిబ్రవరి 26 వరకూ రాత పూర్వకంగా తమ అభిప్రాయాలు తెలపాలని ఈసీ కోరింది.

ఇక… ఈసీ నిర్వహించిన సమావేశానికి టీడీపీ పక్షాన పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. రిమోట్ ఓటింగ్ మెషీన్ ఆలోచనను సూత్రప్రాయంగా స్వాగతిస్తున్నామని పయ్యావుల తెలిపారు. అయితే.. ఎన్నికల సంఢం అనుసరించిన విధానాన్ని మాత్రం తప్పు పడుతున్నామని స్పష్టం చేశారు. ముందుగా రాజకీయ పార్టీలను సంప్రదించకుండానే ఆర్వీఎం ప్రతిపాదనను తీసుకొచ్చారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ ఒక్క ఓటరు కూడా ఓటు వేసే అవకాశం కోల్పోకూడదన్నదే ఈసీ అభిప్రాయమని, దానికి తాము కూడా కట్టుబడి వున్నామని పయ్యావుల కేశవ్ తెలిపారు.

ఇక… బీఆర్ఎస్ పక్షాన బి. వినోద్ హాజరయ్యారు. రిమోట్‌ ఓటింగ్‌ విధానాన్ని పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. రిమోట్‌ ఓటింగ్‌ విధానం దేశానికి అవసరమే లేదని అభిప్రాయపడ్డారు. ఈ విషయమై తమ అధినాయకత్వంతో చర్చించి, కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ నెల 30లోగా తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తెలియజేస్తామని చెప్పారు.