దాదాపు 2 గంటలుగా ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. కవితను ముగ్గురు అధికారుల బృందం ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ నిమిత్తం కవిత ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. తర్వాత సంప్రదాయం ప్రకారం ఎంట్రీ బుక్ లో వివరాలు నమోదు చేశారు. ఈ సందర్భంగా అభివాదం చేస్తూ… లోపలికి వెళ్లిపోయారు. అయితే.. విచారణ సమయంలో కవిత స్టేట్ మెంట్ మొత్తాన్నీ ఈడీ అధికారులు రికార్డు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అలాగే బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై, శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ తదితరులు ఇచ్చిన ఇచ్చిన పూర్తి సమాచారం ఆధారంగానే ఈడీ విచారణను సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలు, ఇండో స్పిరిట్స్ కంపెనీలో వాటాలు,100 కోట్ల ముడుపుల వ్యవహారంపై కవితను ఈడీ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ హోటల్ లో ఏం జరిగింది.. సౌత్ గ్రూపులో మీ పాత్ర ఏంటీ.. సౌత్ గ్రూప్ లావాదేవీల్లో మీకు వాటాలు ఉన్నాయా లేవా.. అరుణ్ పిళ్లయ్.. బుచ్చిబాబులతో ఉన్న వ్యాపార సంబంధాలపై కూడా ఈడీ ఆరాతీస్తున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ రోజు ఉదయం ఢిల్లీలోని తన నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి కవిత వెళ్లారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచే ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఇదిలా వుండగా… మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలందరూ ఢిల్లీకి చేరుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కవితకు నైతిక మద్దతుగా ఢిల్లీ వెళ్లాలని సూచించారు. ఇప్పటికే మొదటగా మంత్రి కేటీఆర్ శుక్రవారం రాత్రి బయల్దేరారు. ఆ తర్వాత హరీశ్ రావు బయల్దేరారు.
ఈ ముగ్గురూ ఢిల్లీలో శుక్రవారం రాత్రి న్యాయ నిపుణులు, పార్టీ లీగల్ సెల్ తో సమావేశమై చర్చించారు. తాజాగా… మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు ఢిల్లీ బాటపట్టారు. ఒకవేళ ఈడీ కవితను అరెస్ట్ చేస్తే… ఢిల్లీలో నిరసన వ్యక్తం చేయాలన్నది బీఆర్ఎస్ ప్లాన్ గా తెలుస్తోంది.