మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ తక్షణమే ప్రారంభమవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 14 వరకూ నామినేషన్లు దాఖలు చేయవచ్చని, ఈ నెల 17 న ఉపసంహరణకు చివరి గడువు అని తెలిపింది. ఇక… నవంబర్ 3 న పోలింగ్ వుంటుందని, 6 న కౌంటింగ్ నిర్వహిస్తామని ఈసీ తెలిపింది. మరోవైపు నేడు కేవలం ఇద్దరు మాత్రమే బైపోల్ నామినేషన్లను దాఖలు చేశారని అధికారులు ప్రకటించారు.

అధికార టీఆర్ఎస్ తన మునుగోడు అభ్యర్థిని ప్రకటించింది. ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, మునుగోడు నియోజకవర్గ ఇన్ ఛార్జీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును ప్రకటించారు. 2014లో మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల గెలిచారు. ఇక… ఈ నెల 10 న కూసుకుంట్ల నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈయన నామినేషన్ కు మంత్రులు కేటీఆర్, హరీశ్, జగదీశ్ రెడ్డి హాజరుకానున్నారు.

 

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 1965లో జంగారెడ్డి, కమలమ్మ దంపతులకు జన్మించారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలంలోని లింగవారి గూడెం ఆయన స్వస్థలం. నల్గొండలోని నాగార్జన కాలేజ్ నుంచి బీఎస్సీ కంప్లీట్ చేసిన కూసుకుంట్ల.. హైదరాబాద్ లోని వివేక్ వర్ధిని కాలేజ్ నుంచి బి.ఎడ్ పట్టా అందుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందు కొంతకాలం టీచర్ గా పనిచేశారు.