వైసీపీకి శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ను నియమించినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం వైసీపీకి ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీలకు జీవితకాల శాశ్వత అధ్యక్షులు వుండటం, అలాంటి పదవులను ఏర్పాటు చేయడం అప్రజాస్వామికమని ఈసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అలా చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ వార్తలపై అంతర్గత విచారణ చేసి, ఆ వార్తలను ఖండిస్తూ… బహిరంగ ప్రకటన చేయాలని ఈసీ ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి వైసీపీ ప్రధాన కార్యదర్శికి నోటీసులు పంపారు. ఇలా ఓ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా వుండటం చెల్లదేని తేల్చి చెప్పింది.
వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ అంటూ పేపర్లలో వచ్చిన వార్తల ఆధారంగా తాము పార్టీకి పలు మార్లు లేఖ రాశామని, అయినా స్పందన రాలేదని ఈసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. స్పందన లేకపోవడంతో ఇది నిజమేనని తాము భావిస్తున్నామని, దీనిపై పార్టీలో అంతర్గత విచారణ జరిపి, అసలు విషయమేంటో తమకు తెలపాలని ఈసీ ఆదేశించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ పార్టీకి అయినా… తరుచూ ఎన్నికలు జరుగుతూ వుండాలని స్పష్టం చేసింది. ఏ పార్టీకి అయినా… శాశ్వత అధ్యక్షుడు, శాశ్వత పదవులు వుండవని, అవి తప్పని ఈసీ తేల్చి చెప్పింది. ఈ పార్టీ ఎన్నికలు అయినా… ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలకు మేరకు జరగాల్సి వుందని తన తాఖీదుల్లో ఈసీ ప్రకటించింది.