తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అధికారిక కసరత్తు మొదలైంది. రిటర్నింగ్‌ అధికారుల జాబితా పూర్తి చేయడంతో పాటు జూన్‌ 1 నుంచి ఈవీఎంల పనితీరును అధికారులు పరిశీలించనున్నారు. ఓటర్ల చేరికలు, తొలగింపు కసరత్తుపైనా దృష్టి సారించారు. ఓటింగ్‌ శాతం పెంచాలని నిర్ణయించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ పై సీఈసీ సీనియర్‌ అధికారుల బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించింది. పూర్తయిన రిటర్నింగ్‌ అధికారుల (ఆర్‌ఓ) జాబితా ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయాలని సీఈసీ అధికారులు ఆదేశించారు. జూన్‌ 1 నుంచి ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ మెషీన్ల (ఈవీఎం) మొదటి స్థాయి తనిఖీ ప్రారంభించాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అన్ని స్థాయిల అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు.