ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతీ (99) ఆదివారం శివైక్యం చెందారు. మధ్యప్రదేశ్ లోని నర్సింగపూర్ లోని ఆశ్రమంలో మధ్యాహ్నం 3:30 గంటలకు స్వరూపానంద సరస్వతీ తుది శ్వాస విడిచారని స్వామి సదానంద మహారాజ్ ప్రకటించారు. గత యేడాది కాలంగా స్వామి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. సియోని జిల్లా జబల్‌పూర్ సమీపంలోని డిఘోరి గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో శంకరాచార్య జన్మించారు. 9వ ఏటనే ఇల్ల విడిచిపెట్టి, హిందూమత ఉద్ధరణకు నడుం బిగించారు. యూపీలోని వారణాసి చేరుకుని స్వామి కర్పత్రి మహరాజ్ వద్ద వేదాలు అభ్యసించారు. రివల్యూషనరీ సాధువుగా పేరున్న ఆయన స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్లారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం కృషి చేశారు.
ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతీ శివైక్యం చెందడంపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్ వేదికగా సంతాపం ప్రకటించారు. భారతీయ సంప్రదాయం వున్న వరకూ ఆయన గుర్తుండిపోతారని, ఆయనకు సద్గతులు కలగాలని షా ట్వీట్ చేశారు.