బీజేపీ నేత బీఎల్ సంతోష్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.  ఎమ్మెల్యేలకు ఎర కేసులో 26న లేదా 28న విచారణకు హాజరు కావాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌కు సిట్‌ జారీచేసిన నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. సిట్‌ 41ఏ కింద జారీచేసిన నోటీసును బీఎల్‌ సంతోష్‌ సవాల్‌ చేసిన కేసులో న్యాయమూర్తి జస్టిస్‌ కే సురేందర్‌ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. ముందుగా నిర్ణయించుకొన్న షెడ్యూ ల్‌ ప్రకారం వేరే కార్యక్రమాల్లో పాల్గొంటున్నందున సిట్‌ దర్యాప్తునకు హాజరుకాలేకపోయినట్టు ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది దేశాయ్‌ ప్రకాష్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. ఫిర్యాదులో బీఎల్ సంతోష్ పేరు లేనప్పుడు నిందితుల జాబితాలో ఎలా చేరుస్తారని ఆయన ప్రశ్నించారు.  అవినీతి నిరోధక చట్టం కింద నోటీసు జారీ చెల్లదని చెప్పారు. బీఎల్‌ సంతోష్‌ నుంచి పలు ఆధారాలు రాబట్టాల్సి ఉన్నదని సిట్‌ తరఫున అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌, అదనపు ఏజీ జే రామచంద్రారావు వాదించారు. సిట్‌ విచారణకు హాజరుకాకుండా కోర్టుల్లో కేసు మీద కేసు వేయటం సరికాదని అన్నారు. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని కోర్టును కోరారు. వాదనలను డిసెంబర్‌ 5న కొనసాగిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. అప్పటి వరకు పిటిషనర్‌ను పోలీసులు అరెస్టు చేయవద్దని ఆదేశించారు.