తమిళనాడులో గవర్నర్, సీఎం స్టాలిన్ మధ్య పోరు మరింత తీవ్రమైంది. గవర్నర్ పదవి నుంచి ఆర్.ఎన్. రవిని వెంటనే తొలగించాలని అధికార డీఎంకే రాష్ట్రపతి ముర్ముకు లేఖ రాసింది. తమ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైందని, అలాంటి తమను ప్రజలకు సేవ చేయనీకుండా గవర్నర్ అడ్డుకుంటున్నారని డీఎంకే తన లేఖలో పేర్కొంది. అలాగే గవర్నర్ చేసే వ్యాఖ్యలు, ప్రకటనలు ప్రభుత్వం పట్ల ప్రజలకు తీవ్ర వ్యతిరేకత పెంచే విధంగా వున్నాయని సీఎం ఆక్షేపించారు. అలాగే ఆయన ప్రసంగాలు కూడా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వుందని డీఎంకే తన లేఖలో పేర్కొంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో వుండేందుకు ఆయన అనర్హులని, వెంటనే ఆయనను తొలగించాలని డీఎంకే తన లేఖలో డిమాండ్ చేసింది.
ఆర్ఎన్ రవి గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించేటపుడు రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షిస్తానని, కాపాడతానని ప్రమాణం చేశారని, ఆ ప్రమాణాన్ని ఆయన ఉల్లంఘిస్తున్నారని ద్రౌపది ముర్ముకు సమర్పించిన వినతిపత్రంలో డీఎంకే ఆరోపించింది. ఆయన మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని తెలిపింది. పలు బిల్లలు గవర్నర్ వద్దే ఆగిపోవడంపై డీఎంకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దాదాపు ఆమోదం పొందాల్సిన 20 బిల్లులు గవర్నర్ వద్దే పెండింగ్ లో వుండిపోయాయి.