సినీ పరిశ్రమసమస్యల పరిష్కారం కోసంకృషి చేసిన మహనీయుడు దాసరి

సినీ పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు దర్శకరత్న దాసరి నారాయణరావు అని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం దాసరి నారాయణరావు 76 వ జయంతి సందర్భంగా చిత్రపురి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత C. కళ్యాణ్, డైరెక్టర్ నిమ్మల శంకర్, దాసరి నారాయణరావు తనయుడు దాసరి అరుణ్ కుమార్, చిత్రపురి కాలనీ అధ్యక్షుడు అనిల్, దొరై రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సినీ పరిశ్రమలోని 24 విభాగాలకు చెందిన కార్మికులకు ఏ సమస్య వచ్చినా నేను ఉన్నానంటూ ఒక ధైర్యాన్ని కల్పించారని తెలిపారు. 150 చిత్రాలకు దరహకత్వం వహించి గిన్నీస్ బుక్ లో చోటు దక్కించుకున్నారని గుర్తు చేశారు. 53 చిత్రాలకు నిర్మాతగా, 250 కి పైగా చిత్రాలకు కథ, పాటల రచయితగా, నటుడిగా పని చేశారని చెప్పారు. తాతా మనువడు, మేఘ సందేశం, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి వంటి అనేక గొప్ప గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించారని తెలిపారు. బంగారు నంది, నంది, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు ఇలా అనేక అవార్డులను ఆయన అందుకున్నారని పేర్కొన్నారు. దాసరి నారాయణరావు మరణంతో సినీ పరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోయిన భావనను ఇప్పటికీ పరిశ్రమలోని అనేకమంది వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. దాసరి నారాయణరావు తో తనకు ఉన్న అనుబంధాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సినీ పరిశ్రమలోని కార్మికులకు సొంత ఇల్లు ఉండాలనే ఆలోచనతో నాటి నటుడు ప్రభాకర్ రెడ్డి తో కలిసి అప్పటి ప్రభుత్వాలపై దాసరి నారాయణరావు ఒత్తిడి తీసుకొచ్చిన ఫలితంగానే నేడు చిత్రపురి కాలనీలో వేలాదిమంది కార్మికులకు ఇండ్లు కేటాయించిన విషయాన్ని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ని ప్రభుత్వం చిత్ర పరిశ్రమ అభివృద్ధి కి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వస్తుందని చెప్పారు. చిత్రపురి కాలనీకి రోడ్డు నిర్మాణం ఎంతో కష్టతరమైన కూడా నిర్మించినట్లు తెలిపారు. ఇవే కాకుండా ఇంకా అనేక సమస్యలు పరిష్కరించి పలు అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చి చిత్ర పరిశ్రమలో ఉపాధి పొందుతున్న వారందరినీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పరిశ్రమలోని అర్హులైన వారందరికీ అందిస్తామని ప్రకటించారు.

Related Posts

Latest News Updates