తెలంగాణ పీసీసీ నేతలకు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. పూర్తి సమన్వయం పాటించాలని, పార్టీలో అంతర్గతంగా మాత్రమే చర్చించాలని సూచించారు. ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకోవద్దని, క్రమశిక్షణను ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు వుంటాయని హెచ్చరించి వెళ్లారు. తెలంగాణలో ఏర్పడ్డ పరిస్థితిని చక్కదిద్దాలని అధిష్ఠానం డిగ్గీరాజాను హైదరాబాద్ కి పంపింది. ఇందులో భాగంగా దిగ్విజయ్ ఒక రోజు పూర్తిగా గాంధీ భవన్ లోనే వుండి… నేతలతో మాట్లాడారు. ఈ మాట్లాడే సమయంలోనే ఈరవ్రతి అనిల్ ను ఓయూ కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం, కొట్లాట కూడా జరిగింది. ఇదంతా దిగ్విజయ్ సింగ్ సమక్షంలోనే జరిగింది. బీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత వుందని, ఈ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని సూచించారు. పార్టీనేతలంతా ఐక్యంగా పనిచేయాలని, ప్రజాక్షేత్రంలోనే వుండాలని సూచించారు. కొత్తవారికి పీసీసీ బాధ్యతలు ఇవ్వడం కొత్తేమీ కాదని డిగ్గీరాజా రేవంత్ ను వెనకేసుకొచ్చారు.
ఇక… మీడియా సమావేశంలో దిగ్విజయ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. కేసీఆర్ కి బలం లేక కాంగ్రెస్ నేతలను కొనుగోలు చేశారని మండిపడ్డారు. కేంద్రం చేసే చట్టాలన్నింటికీ కేసీఆర్ మద్దతు వుందని ఆరోపించారు. కుటుంబ పాలన, అవినీతిలో కేసీఆర్ ప్రభుత్వం కూరుకుపోయిందని మండిపడ్డారు. ఇక… మోదీ విధానాలతో పేదవాళ్లు మరింత పేదవారిగా, ధనికులు మరింత ధనికులుగా మారుతున్నారని ఆరోపించారు. కేంద్ర ఆరోగ్య మంత్రి భారత్ జోడో యాత్రను ఎందుకు ఆపమంటున్నారని ప్రశ్నించారు. కేంద్రం ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిందా? అని ప్రశ్నించారు.