తనకు గొప్ప ఉపశమనం లభించిందని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పేర్కొన్నారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలను మల్లికార్జున ఖర్గే స్వీకరించిన నేపథ్యంలో సోనియా ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఖర్గే అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి సోనియా, రాహుల్ తో పాటు ఏఐసీసీ, సీడబ్ల్యూసీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడారు. తాను పార్టీ విస్తరణకు ఎంత చేయాలో అంత చేశానని, ఇప్పుడు చాలా రిలీఫ్ గా ఫీల్ అవుతున్నానని అన్నారు.

అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఖర్గేకి శుభాకాంక్షలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఖర్గే ఎంతో అనుభవం వున్న నేత అని, చాలా కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగారని, చాలా కష్టపడే తత్వం కలిగిన నేత అని ప్రశంసించారు. పార్టీ కార్యకర్తలకు ఎంతో ప్రేరణ కలిగిస్తారని ప్రకటించారు. పార్టీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని, ఐకమత్యంగా అందరూ జట్టుగా ముందుకు సాగాలని సోనియా పిలుపునిచ్చారు.












