లాక్ డౌన్ విషయంలో చైనా ప్రభుత్వం వ్యవహరిస్తున్న నియంతృత్వం విషయంలో ప్రపంచ దేశాలన్నీ విమర్శిస్తున్నా, స్థానిక ప్రజలు అగ్గిమీద గుగ్గిలమైనా అక్కడి ప్రభుత్వం మాత్రం బెట్టు వీడటం లేదు. ప్రభుత్వం వీడని బెట్టు కారణంగా తాజాగా మూడేళ్ల చిన్నారి మరణించింది. చైనాలోని లాంఝౌ నగరం నెలరోజులుగా లాక్ డౌన్ లో వుంది. నిత్యావసరాలతో పాటు అత్యవసర సేవలు కూడా లేకుండా పోయాయి. దీంతో లాక్ డౌన్ నిబంధనల కారణంగా సరైన వైద్యం అందక మూడేళ్ల పసికూన మరణించింది. తన బిడ్డను ఆస్పత్రిలో చేర్చేందుకు ఇంటి నుంచి బయటకు వస్తానంటే సిబ్బంది అంగీకరించలేదని, సకాలంలో అంబులెన్స్ కూడా రాలేదని, బిడ్డ తండ్రి పేర్కొన్నాడు. దీంతో తప్పించుకొని, ట్యాక్సీ పట్టుకొని, ఆస్పత్రికి వెళ్లానని, కాసేపటికే తన బిడ్డ మరణించిందని వైద్యులు తెలిపారని పేర్కొన్నారు. దీంతో కాలనీ వాసులు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం దిగొచ్చి, క్షమాపణలు చెప్పింది.
