బీజేపీలో చేరి మూడు నెలలైనా గడిచిందో లేదో… అప్పుడే ఆ పార్టీకి దాసోజు శ్రవణ్ రాజీనామా చేసేశారు. నేటి సాయంత్రం మంత్రి కేటీఆర్ సమక్షంలో దాసోజు టీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కి పంపించారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరంగా వుందని తన రాజీనామా లేఖలో విమర్శించారు. ప్రత్యామ్నాయ రాజకీయలు చేస్తామని బీజేపీ చెప్పిందని, కానీ.. బలహీన వర్గాల వారికి స్థానం వుండటం లేదని మండిపడ్డారు. అనేక ఆశలతో, ఆశయాలతో బీజేపీ చేరినప్పటికీ, దశాదిశాలోని నాయకత్వ ధోరణులు, తెలంగాణ సమాజానికి ఏమాత్రం ఉపయోగకరంగా లేని రాజకీయాలు చేస్తున్నారని దాసోజు తన రాజీనామా లేఖలో విమర్శించారు.

 

గతంలో సుదీర్ఘ కాలం పాటు దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ లోనే వున్నారు. మధ్యలో చిరంజీవి స్థాపించిన పీఆర్పీలో చేరారు. 2014 లో కాంగ్రెస్ లో చేరారు. రాహుల్ గాంధీ టీమ్ లో కూడా పనిచేశారు. 2018 లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. అయినా… కాంగ్రెస్ లోనే కొనసాగారు. ఆ తర్వాత 3 నెలల క్రితమే దాసోజు శ్రవణ్ తరుణ్ ఛుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.