ఒకే ఒక్క రోజు…. డీ. శ్రీనివాస్ యూటర్న్ తీసేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీకి రాజీనామా ప్రకటించేశారు. ఆదివారం రోజున డీఎస్ తన కుమారుడు సంజయ్ తో కలిసి తిరిగి కాంగ్రెస్ లో చేరారు. డీఎస్ రాజీనామా విషయాన్ని ఆయన భార్య విజయలక్ష్మి రాజీనామా లేఖను విడుదల చేశారు. కాంగ్రెస్ వాళ్లు కానీ..మీడియా వాళ్లు కానీ ఇటువైపు రాకండి అని తేల్చి చెప్పేశారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదు..డీఎస్ ను పార్టీలో చేర్చుకునే విధానం ఇది కాదు..డీఎస్ అనారోగ్యంతో ఉన్నారు. మీ రాజకీయాలకు డీఎస్ ను వాడుకోవద్దు అంటూ కాంగ్రెస్ ను ఘాటుగా హెచ్చరించారు. అటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు డీఎస్ తెలిపారు. తనను వివాదాల్లోకి లాగొద్దని డీఎస్ విజ్ఞప్తి చేశారు.
ఇగో డీఎస్ గారి రాజీనామా
”ఇది రాజకీయాలు చేసే సమయం కాదు. ఆయనను మీరు పార్టీలో చేర్చుకునే పద్ధతి కూడా ఇది కాదు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పక్షవాతం కూడా వచ్చింది.దయచేసి, మీ రాజకీయాలకు ఆయన్ను వాడుకోవద్దు. మీరు నిన్న పెట్టిన ఒత్తిడికి ఆయనకు రాత్రి ఫిట్స్ కూడా వచ్చాయి. కాంగ్రెస్ వారికి చేతులు జోడించి దండం పెడుతున్నా. ఇంకోసారి ఇటువైపు రాకండి. ఈ వయసులో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కొంచెం ప్రశాంతంగా బతకనీయండి” అంటూ కాంగ్రెస్ కి ఘాటు లేఖ రాశారు.

సీనియర్ నేత డీ. శ్రీనివాస్ తిరిగి సొంతగూటికి చేరారు. డీఎస్ తో పాటు ఆయన పెద్ద కొడుకు సంజయ్ కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ పార్టీలోకి ఆహ్వానించారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకు ముందు డీఎస్ కాంగ్రెస్ లో చేరికపై ట్విస్ట్ ల మీద ట్విస్టులు వచ్చాయి. తాను కాంగ్రెస్ లో చేరడం లేదని మార్చి 26న ఉదయం డీఎస్ పేరిట ఓ లేఖ రిలీజయింది. ఈ లేఖలో తన పెద్ద కొడుకు సంజయ్ తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో చేరనున్న తన పెద్ద కొడుకు సంజయ్ కు శుభాకాంక్షలు తెలిపారు. తన ఆరోగ్యం సహకరిస్తే గాంధీ భవన్ కు వెళ్లి సంజయ్ ని ఆశీర్వదీస్తానని చెప్పారు. ఇప్పటికే తన చిన్న కొడుకు అర్వింద్ ఎంపీగా ప్రజాసేవలో ఉన్నాడని చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో అధికారికంగా చేరారు.