కాంగ్రెస్ మొదటి రోజు ప్లీనరీ సమావేశాలు ముగిశాయి. ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో ప్రారంభమైన ప్లీనరీ సమావేశాల్లో కాంగ్రెస్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యున్నత నిర్ణాయక విభాగమైన cwc కి ఎన్నికలు నిర్వహించరాని డిసైడ్ అయ్యింది. పార్టీ అధ్యక్షుడు ఖర్గేనే సభ్యులను నామినేట్ చేసేస్తారని ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ప్రకటించారు. వారందర్నీ అధ్యక్షుడే నామినేట్ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం జరిగిందని ప్రచారం చేశారు. అయితే… సీనియర్లు మాత్రం ఇందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది.
స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఎన్నికలు నిర్వహించాలన్న అభిప్రాయాన్ని అజయ్ మాకెన్, అభిషేక్ మను సింఘ్వీ, దిగ్విజయ్ సింగ్ తదితరులు సమర్థించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కార్యవర్గానికి ఎన్నిక వద్దని, నామినేషన్ వేయాలనే నిర్ణయం కూడా ఏకగ్రీవంగా జరగలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా ఎన్నికలు నిర్వహించవచ్చని సింఘ్వీ తెలిపారు.

కాగా ఈ సమావేశానికి పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు హాజరుకాలేదు. మల్లికార్జున్ ఖర్గే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛనిచ్చేందుకే వారంతా సమావేశానికి దూరంగా ఉన్నారని, మిగతా నిర్ణయాలపై ఎలాంటి ప్రభావం ఉండదని సీనియర్ నేతలు చెప్పారు. మరోవైపు మాజీ ప్రధానులు, మాజీ అధ్యక్షులందరికీ ఇకపై cwc లో శాశ్వత సభ్యత్వం వుండనుంది.
లోకసభ, రాజ్యసభల్లో కాగ్రెస్ పక్ష నేతలు కూడా అలాగే వుంటారు. అంతేగాకుండా cwc స్థానాల్లో 50 శాతం ఇకపై ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, మైనారిటీలు వుండనున్నారు. వీటితో పాటు పార్టీ నియమావళికి ప్రతిపాదించిన 16 సవరణలకు స్టీరింగ్ కమిటీ ఆమోద ముద్ర వేసినట్లు నేతలు ప్రకటించారు. సీడబ్ల్యూసీలో మొత్తం 25 మంది సభ్యులుంటారని, పార్టీ చీఫ్, పార్లమెంటరీ పార్టీ నేత కాకుండా మిగతా 23 మందిలో 12 మందిని ఎన్నుకుంటారు. 11 మంది నామినేట్ అవుతూ వుంటారు.

నేడు రెండో రోజు ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు రెండో రోజు సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉదయం 9 గంటల వరకే అందరూ చేరుకోవాలని పార్టీ సూచించింది. ఉదయం 9:50 నిమిషాలకు అధ్యక్షుడు ఖర్గే జెండాను ఆవిష్కరిస్తారు. ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ భాగేల్ ప్రారంభోపన్యాసంచేస్తారు. 10:30 కి ఖర్గే ఉపన్యసిస్తారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో సుదీర్ఘకాలం పార్టీ అధినేతగా సేవలందించిన సోనియాకి ధన్యవాదాలు తెలుపుతూ ఓ తీర్మానం చేయనున్నారు. 11:30 గంటలకు సోనియా గాంధీ ప్రసంగిస్తారు.












