ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే కోవిడ్ కేసులు భారత్ లో తక్కువగానే వున్నాయని, పరిస్థితులు అంత ఘోరంగా ఏమీ లేవని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అధర్ పూనావాలా ప్రకటించారు. కరోనా సమయంలో ఆరోగ్య కార్యకర్తలు, ఇతర అధికారులు బాగా కష్టపడ్డారని, నిరుపమాన సేవలు చేశారని కొనియాడారు. పూణేలోని భారతీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. కోవిడ్ ని ఎలా నియంత్రించగలిగాం? అంటూ ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు భారత్ వైపే ఆసక్తిగా చూస్తున్నాయన్నారు.
కోవిడ్ ని ఇంత అదుపులోకి తెచ్చామంటే, వ్యాక్సినేషన్ విజయవంతం అయ్యిందంటే.. కేంద్ర ప్రభుత్వ పాత్ర, ఆరోగ్య కార్యకర్తల పాత్రతో ప్రజల పాత్ర కూడా ఎంతో వుందన్నారు. అందుకే కోవిడ్ ని అదుపులోకి తెచ్చే విషయంలో భారత్ సక్సెస్ అయ్యిందని పూనావాలా వివరించారు. ప్రపంచ దేశాలన్నింటి కంటే… భారత్ లోనే మెరుగైన పరిస్థితులు వున్నాయని అధర్ పూనావాలా తెలిపారు.












