ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టైన ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను సీబీఐ సోమవారం నాడు కోర్టులో హాజరుపరిచింది. సిసోడియా తాము అడిగిన ప్రశ్నలను పూర్తిగా దాటేస్తున్నారని, సరిగ్గా సమాధానాలు ఇవ్వడం లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగాలంటే… ఆయనను 5 రోజుల కస్టడీకి అప్పగించాలని సీబీఐ న్యాయస్థానాన్ని కోరింది. అయితే… సీబీఐ కస్టడీ పిటిషన్పై తీర్పును రౌస్ ఎవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు సిసోడియా తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ దయాన్ కృష్ణన్ సీబీఐ కస్టడీ పిటిషన్ను వ్యతిరేకించారు.తన క్లయింట్ విచారణకు సహకరిస్తున్నందున సీబీఐ కస్టడీ అవసరంలేదని చెప్పారు. అయితే… ఈ కేసులో సీబీఐ డిప్యూటీ సీఎం సిసోడియాను నెంబర్ 1 నిందితుడిగా పేర్కొంది.

సిసోడియా అరెస్ట్ కు నిరసగా ఆప్ ఆందోళనలు
సిసోడియా అరెస్ట్ ను నిరసిస్తూ… దేశ రాజధానిలో ఆమ్ ఆద్మీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రధాన కార్యాలయం దగ్గర నిరసన చేపట్టారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకొని, కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. దీంతో పోలీసులు ఆప్ కార్యకర్తలను అడ్డుకున్నారు. చివరికి ఆప్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక… దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఆప్ నిరసనలు వ్యక్తం చేసింది.

సిసోడియాను అరెస్ట్ చేయాలని రాజకీయంగా ఒత్తిళ్లు : సీఎం కేజ్రీవాల్
మద్యం కేసులో అరెస్టైన డిప్యూటీ సీఎం సిసోడియా విషయంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. సిసోడియా అరెస్ట్ సీబీఐకి చెందని చాలా మంది అధికారులకు నచ్చలేదని, దానిని వ్యతిరేకించారని బాంబు పేల్చారు. ఈ విషయం తనకు తెలుసని, వారందరికీ సిసోడియాపై గౌరవం వుందంటూ వ్యాఖ్యానించారు. సిసోడియాకి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని, అరెస్ట్ కోసం రాజకీయంగా తీవ్ర ఒత్తిడి వచ్చిందని, అధికారులు ఆ ఒత్తిడికి తలొగ్గారని కేజ్రీవాల్ ఆరోపించారు.












