తెలంగాణలో సంచలన రేపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల రిమాండ్ కు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి తిరస్కరించారు. ఈ కేసు ఏసీబీ పరిధిలోకి రాదని, వెంటనే నిందితులను విడుదల చేయాలని ఆదేశించారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు డీల్‌లో బుధవారం రాత్రి రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజి స్వామీజీని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం వరకు ఆ ముగ్గురిని విచారించిన పోలీసులు, వైద్య పరీక్షలు చేయించి రాత్రి 9:30 గంటల సమయంలో ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం జడ్జి ఇంటి వద్ద హాజరుపరిచారు. దీంతో ఇరు పక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి… రిమాండ్ కు నిరాకరించారు. వారి అరెస్టు సరికాదని స్పష్టం చేశారు. ‘‘ఈ కేసులో పెట్టిన సెక్షన్లకు అనుగుణంగా సాక్ష్యాధారాలు లేవు. అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి ఈ కేసు రాదు.” అని తేల్చి చెప్పేశారు. న్యాయమూర్తి ఆదేశాల నేపథ్యంలో వారిని విడిచిపెట్టామని పోలీసులు ప్రకటించారు.
ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్ కలిసి తనతో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయవద్దని, పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాలని బేరసారాలు చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తే రూ.100 కోట్లు ఇస్తామని రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజి ప్రలోభపెట్టార అని అందులో ఆరోపించారు. డబ్బుతో పాటు కేంద్ర ప్రభుత్వ సివిల్ కాంట్రాక్టులు ఇప్పిస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. మాట వినకుంటే క్రిమినల్ కేసులు, ఈడీ, సీబీఐతో రెయిడ్స్ చేయిస్తామని బెదిరించినట్లు వివరించారు.