హైదరాబాద్ నగరంలో పాక్ ఐఎస్ఐ సహకారంతో ఉగ్రదాడికి కుట్ర చేయగా పోలీసులు భగ్నం చేశారు. కుట్రకు పాల్పడ్డ అబ్దుల్ జాహెద్తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. సభలపై గ్రెనేడ్లు విసిరేందుకు కుట్ర పన్నారన్న సమాచారంతో పోలీసులు వారిని అరెస్టు చేసి, నాలుగు హ్యాండ్ గ్రెనేడ్లు, రూ.5.41లక్షలు, మొబైల్ఫోన్స్, బైక్ స్వాధీనం చేసుకున్నారు. జాహెద్తో పాటు సమీయుద్దీన్, హసన్ ఫరూక్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అబ్దుల్ జాహెద్పై గతంలో ఉగ్ర కార్యకలాపాల కేసులున్నాయి. పాక్ ఐఎస్ఐ తీవ్రవాదులతో సంబంధాలున్నాయన్న సమాచారంతో పోలీసులు అరెస్టు చేయగా.. గ్రెనేడ్లు విసిరి భయాందోళనలు, మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేందుకు పథకం పన్నినట్లు తేలింది.. సమీరుద్దీన్ సైదాబాద్ వాసి కాగా.. మాజ్ హసన్ ఫరూక్ మెహదీపట్నం వాసి. జాహెద్ గతంలో బేగంపేట టాస్క్ఫోర్స్ కార్యాలయంలో పేలుడు, ఇతర ఘటనల్లో పాల్గొన్నాడు. తాజాగా పాక్ ఐఎస్ఐతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.  నిఘావర్గాల సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి.. ముగ్గురిని అరెస్టు చేశారు.