గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని పార్టీలూ తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో నిమగ్నమయ్యాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ 43 మందితో తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. పార్టీ నూతన అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) సమావేశంలో మొదటి జాబితాను ఖరారు చేశారు. తొలి జాబితాలో 10 మంది పటేల్, 11 మంది గిరిజనులు, 10 మంది ఓబీసీలు, ఐదుగురు ఎస్సీలు ఉన్నారు.సీఎం భూపేంద్ర పటేల్ నియోజకవర్గమైన ఘట్లోడియా నుండి రాజ్యసభ ఎంపీ అమీబెన్ యాగ్నిక్‌ను పార్టీ బరిలోకి దింపింది. అయితే… కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన దాహోద్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే భవేష్ కటారాకు బదులుగా మితేష్ గరాసియాకు టిక్కెట్ దక్కింది. ఇక… గాంధీనగర్ సౌత్, సూరత్ వెస్ట్, జామ్ నగర్ నార్త్, రాజ్ కోట్ రూరల్, రాజ్ కోట్ సౌత్ తో సహా పలు కీలక నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. బీజేపీ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తోంది.
గుజరాత్ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. డిసెంబరు 1న తొలి దశలో ఓటింగ్, డిసెంబర్ 2న రెండో దశలో పోలింగ్ జరగనుంది. కాగా డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. హిమాచల్ ప్రదేశ్ తర్వాత గుజరాత్ ఎన్నికల తేదీలను కూడా ఎన్నికల సంఘం నేడు ప్రకటించింది. గుజరాత్ అసెంబ్లీలోని మొత్తం 182 స్థానాలున్నాయి. గుజరాత్‌లో 142 జనరల్, 17 ఎస్సీ, 23 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. గుజరాత్‌లో 4.9 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు.అయితే ఇందులో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్‌కు 77 సీట్లు వచ్చాయి. గుజరాత్ 14వ శాసనసభ పదవీకాలం ఫిబ్రవరి 18, 2023తో ముగుస్తుంది. అంతకంటే ముందే ఎన్నికలు నిర్వహించి.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది.