అయోధ్యలోని రామ మందిరం జనవరి 1, 2024 న అందుబాటులోకి వస్తుందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. అమిత్ షా ఏమైనా అర్చకుడా? మహంతా? అంటూ ప్రశ్నించారు. ఆయన ఏదీ కాదని, ఆయన ప్రకటనను చూస్తే ఆశ్చర్యమేస్తోందన్నారు. భగవంతుడిపై అందరికీ విశ్వాసం వుంటుందని, కానీ… అలాంటి ప్రకటనలు ఎందుకని ఖర్గే ఆగ్రహంవ్యక్త చేశారు. త్రిపుర ఎన్నికల నేపథ్యంలోనే అలా చేశారన్నారు. ”అలా ప్రకటన చేయడానికి మీరెవరు? అర్చకులా? రామ మందిర మహంతులా? వారు చెబితే బాగుంటుంది. మీరు రాజకీయ నేత. దేశాన్ని సురక్షితంగా వుంచడం మీ పని. శాంతిభద్రతలను కాపాడటం మీ విధి. రైతులకు గిట్టుబాటుధర ఇవ్వడం, ఆహార భద్రత కల్పించడం మీపని” అంటూ ఖర్గే మాట్లాడారు.
అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. జనవరి 1,2024 నాటికి అయోధ్య రామ మందిరం సిద్ధమవుతుందని ప్రటకించారు. త్రిపురలో బీజేపీ జన్ విశ్వాస యాత్ర ప్రారంభించిన సందర్భంగా అమిత్ షా ఈ కీలక ప్రకటన చేశారు. అయోధ్య రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కోర్టుల్లో దావాలు వేసిందన్నారు. కానీ… సుప్రీం తీర్పు వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారని తెలిపారు.