కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలకు దిగారు. చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే… కేంద్రం మాత్రం నిద్రపోతోందంటూ విమర్శలకు దిగారు. చైనాతో భారత్ కు అసలు ముప్పే లేదన్నట్లుగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర 100 రోజులకు చేరుకున్న సందర్భంగా ఆయన రాజస్థాన్ లో విలేకరులతో మాట్లాడారు. చైనా యుద్ధం చేయడానికే సన్నద్ధమవుతోందని తాను 2 సంవత్సరాలుగా పదే పదే చెబుతూనే వున్నానని అన్నారు.
ముప్పు స్పష్టంగా ద్యోతకమవుతున్నా… కేంద్రం ఈ విషయాన్ని దాచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పైగా పట్టించుకోనట్లుగానే వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. భారత్ పై యుద్ధం చేసేందుకు అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్ లో చైనా సన్నాహాలు చేసుకుంటూ వుంటే.. మన ప్రభుత్వం నిద్రపోతోందని ఎద్దేవా చేశారు. బీజేపీ వ్యక్తిగతంగా తన ప్రతిష్టను, కాంగ్రెస్ ప్రతిష్టను దిగజార్చేందుకు ఒక పద్ధతి ప్రకారం ప్రచారం సాగిస్తోందంటూ రాహుల్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ సైద్ధాంతిక విలువలకు కట్టుబడిన పార్టీ అని, ఫాసిజానికి పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు.












