అదానీ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్ సభలో కేంద్రాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. మోదీ, అదానీ బంధం ఈనాటిది కాదని ఎద్దేవా చేశారు. ప్రతి రాష్ట్రంలోనూ అదానీ గురించే చర్చ జరుగుతోందని, అదానీ ప్రతి వ్యాపారంలో దూరిపోతాడని అన్నారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ….. ప్రతి వ్యాపారంలో దూరిపోయి, విజయం సాధిస్తారని, ఆ బిజినెస్ ట్రిక్ ఏమిటో మాకూ చెప్పాలని అన్నారు. తాము కూడా అదానీలా కావాలని అనుకుంటున్నామని అన్నారు. 2014 లో 8 బిలియన్ డాలర్ల అదానీ సామ్రాజ్యం 2022 లో 140 బిలియన్ డాలర్ల సామ్రాజ్యంగా మారిపోయారని, ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు.

అదానీ కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలను సవరించిందని, మోదీ, అదానీ బంధం ఈనాటిది కాదని చురకలంటించారు. ప్రపంచ సంపన్నుల జాబితాలో 2014 లో 609 స్థానంలో వున్న అదానీ… 2022 లో 2 వ స్థానంలోకి ఎలా వచ్చారని ప్రశ్నించారు. 2014 లోనే అదానీ అసలు మేజిక్ ప్రారంభమైందని అన్నారు. ఎయిర్ పోర్టు డెవలప్ మెంట్ లో పూర్వ అనుభవం లేని వారికి ఎయిర్ పోర్టు డెవలప్ మెంట్, కాంట్రాక్ట్ ఇవ్వరాదన్న నిబంధన వుందని, కానీ… ఆ నిబంధనను కేంద్ర మార్చిపారేసిందని ధ్వజమెత్తారు. మోదీ, అదానీ ఓ విమానంలో ప్రయాణిస్తున్నట్లు కనిపించే ఫొటోను ఆయన ప్రదర్శించారు. లోక్‌సభ సభాపతి ఓం బిర్లా జోక్యం చేసుకుని, ఇటువంటి పోస్టర్లు సభ గౌరవానికి తగినవి కాదన్నారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ, ఇది కేవలం ఓ ఫొటో అని, పోస్టర్ కాదని రాహుల్ వివరణ ఇచ్చారు.












