తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా జరుగుతున్నాయి. గురువారం సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంత్రి కేటీఆర్ మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ధరణి పోర్టల్ విషయంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ధరణి పోర్టల్ వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ధరణి పోర్టల్ ను రద్దు చేయాలన్నదే తమ నినాదమని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. డబుల్ ఖాతాల తొలగింపు, వ్యవసాయేతర భూముల గుర్తింపు, ప్రభుత్వ భూముల రికార్డుల నవీకరణ లాంటివి ధరణి ద్వారా చేశామని చెప్పుకుంటున్న వార్తల్లో చాలా వరకు నిజం లేదని అన్నారు. ధరణి పోర్టల్ లో తమ భూమి కనిపించక యేడాదిలో నలుగురు రైతులు మరణించారని గుర్తు చేశారు. ధరణి వల్ల రాష్ట్రంలో చాలా చోట్ల ఉద్రిక్తపరిస్థితులు తలెత్తుతున్నాయని, ధరణి ద్వారా వివిధ వాటి కింద తీసుకున్న దరఖాస్తులు 5 లక్షల వరకూ పెండింగ్ లో వున్నాయని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

 

కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ధ‌ర‌ణిని ర‌ద్దు చేయ‌డం.. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను బ‌ద్ద‌లు కొట్టడం, బాంబుల‌తో పేల్చేయాల‌న‌డం కాంగ్రెస్ విధానామా? అని కేటీఆర్ కాంగ్రెస్ స‌భ్యుల‌ను సూటిగా ప్ర‌శ్నించారు. గ‌త ఆరేండ్ల‌లో 30 ల‌క్ష‌ల డాక్యుమెంట్లు రిజిస్ట్రేష‌న్ అయితే, ఈ ఏడాదిన్న‌ర కాలంలోనే 23 ల‌క్ష‌ల 92 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేష‌న్ అయ్యాయని తెలిపారు. అన్నిస‌వ్యంగా జ‌రిగితే ఎవ‌రూ మాట్లాడ‌రని, ఎక్క‌డో ఒక చిన్న లోపం జ‌రిగితే భూత‌ద్దంలో పెట్టి చూపిస్తున్నారని మండిపడ్డారు. ధ‌ర‌ణిని ర‌ద్దు చేస్తామ‌ని పార్టీ అధ్య‌క్షుడు చెప్తున్నారని, ధ‌ర‌ణిని ర‌ద్దు చేయ‌డం పార్టీ విధాన‌మే అయితే.. పార్టీ ప‌రంగా చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ధ‌ర‌ణి వ‌ల్ల రైతుల‌కు ఏ లాభం లేదు.. ర‌ద్దు చేస్తామ‌ని చెప్పండని సవాల్ విసిరారు. కాంగ్రెస్ హ‌యాంలో లంచం లేకుండా రిజిస్ట్రేష‌న్లు, మ్యుటేష‌న్లు చేయ‌కుండా రైతుల‌ను రాక్ష‌సంగా ఇబ్బంది పెట్టిన‌ట్లే ఇప్పుడు కూడా ఇబ్బంది పెట్టాల‌ని చూస్తున్నాం అని శ్రీధ‌ర్ బాబు చెప్ప‌ద‌లుచుకున్నారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.