2024 ఎన్నికల్లో వచ్చేది సంకీర్ణమే… కాంగ్రెస్సే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది : ఖర్గే

రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. సంకీర్ణ ప్రభుత్వానికి కాంగ్రెస్ సారథ్యం వహిస్తుందని ప్రకటించారు. నాగాలాండ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. తమతో కలిసి వచ్చే ప్రాంతీయ పార్టీలను కచ్చితంగా కలుపుకొనే వెళ్తామని, అయితే… సంకీర్ణ ప్రభుత్వంలో చేరే విషయంలో ఇప్పటి నుంచే ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు కూడా ప్రారంభించామన్నారు.

 

మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా ఓడిపోతుందన్నారు. ఒకవేళ కాంగ్రెస్ గనక అధికారంలోకి రాకుంటే.. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం లేకుండా పోతాయని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ రాదని, కాంగ్రెస్, మిత్రపక్షాలన్నీ కలిస్తే మెజారిటీ వస్తుందని పేర్కొన్నారు. 100 మంది మోదీలు, అమిత్ షా లు వచ్చినా… 2024 లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.

 

నాగాలాండ్ ప్రజలను బీజేపీ మోసం చేసిందని ఖర్గే విమర్శించారు. 20 ఏళ్లుగా నేషనల్ డెమోక్రెటిక్ ప్రోగ్రేసివ్ పార్టీ, బీజేపీ కలిసి నాగాలండ్ ను లూటీ చేశాయని మండిపడ్డారు. ఇక్కడి సంప్రదాయాలను బీజేపీ నాశనం చేస్తోందని, విభజన, ద్వేషం నింపే రాజకీయాలకు వ్యతిరేకంగా నాగాలాండ్ ప్రజలు పోరాడాలని ఖర్గే పిలుపునిచ్చారు.

 

ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చుకుంటూ, తమవైపు బీజేపీ తిప్పుకుంటోందని ఖర్గే అన్నారు. ఇలా ఆరు, ఏడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుందని ఎద్దేవా చేవారు. కర్నాటకలో కాంగ్రెస్ కి పూర్తి మెజారిటీ వున్నా… 18 మంది ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసి, వారితో రాజీనామా చేయించి, ప్రభుత్వాన్ని లాగేసుకుందని అన్నారు.

Related Posts

Latest News Updates