నిర్మల్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, చేరికల కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ ఛుగ్ హాజరయ్యారు.
ప్రధాని నరేంద్ర మోడీ వల్ల తెలంగాణలో అరాచక పాలనకు అంతం వస్తుందని ఏలేటి మహేశ్వరరెడ్డి చెప్పారు. మోడీ నాయకత్వంలో బీజేపీ పార్టీ బలోపేతం కోసం పని చేస్తానని తెలిపారు. కేసీఆర్ అరాచక పాలన అంతం చేయటం బీజేపీకే సాధ్యమని, అందుకే తాను బీజేపీలో చేరానని తెలిపారు. కొంతకాలం నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి అడుగులు వేస్తున్నాయని, రెండు పార్టీలు కూడా కలిసికట్టుగా పని చేస్తున్నాయన్నారు. అవినీతిపై పోరాటం చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ.. నిస్తేజంగా ఉందన్నారు.
పొత్తు విషయంలోనూ తలోమాట మాట్లాడతారని, బీఆర్ఎస్ తో పొత్తు వుంటుందని ఒకరు, పొత్తు వుండదని మరొకరు… తికమకగా మాట్లాడతారని ఎద్దేవా చేశారు. ఎవరు ఎవరి కోసం పనిచేస్తారో.. తెలియడం లేదన్నారు. 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ లో నిబద్ధతగా కొనసాగానని తెలిపారు. కానీ… సొంత పార్టీ నేతలే సోషల్ మీడియా వేదికగా తనను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. పైగా గంటల లోపలే షోకాజ్ నోటీసులకు సమాధానం ఇవ్వాలని అంటున్నారని, అలా సాధ్యమవుతుందా? అని మండిపడ్డారు. 15 సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తే… కాంగ్రెస్ పెద్ద బహుమానమే ఇచ్చిందని, అది షోకాజ్ నోటీస్ అని పేర్కొన్నారు.
ఇక… బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కోసం కష్టపడి పని చేశారని బండి సంజయ్ చెప్పారు. జేపీ నడ్డా సమక్షంలో మహేశ్వర్ రెడ్డి పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. బీజేపీలో ఆయనకు సరైన ప్రాధాన్యత ఇస్తామన్నారు. తెలంగాణలో నియంతపాలన పోవాలని, పేదల రాజ్యం, రామ రాజ్యం రావాలన్నారు.