హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ బంపర్ విక్టరీ సాధించింది. కానీ.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే అంశంలో మాత్రం మల్లగుల్లాలు పడుతోంది. మాజీ సీఎం వీరభద్ర సింగ్ భార్య ప్రతభా సింగ్, ముకేశ్ అగ్నిహోత్రి, సిక్విందర్ సింగ్ సఖు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తాను సీఎం రేసులో వున్నానని ప్రతిభా సింగ్ బాహాటంగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం సిమ్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పరిశీలకులుగా సీఎం భూపేశ్ బాగేల్, భూపేందర్ హుడా, రాజీవ్ శుక్లా హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసనసభా పక్ష నేతగా ఎవరిని ఎన్నుకోవాలో తీవ్రంగా చర్చించారు. కానీ… ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. దీంతో శాసనసభా పక్ష నాయకుడ్ని ఎన్నుకునే అధికారాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేశారు.
అయితే… హిమాచల్ ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషించిన పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కొత్త సీఎం ఎంపిక బాధ్యతలను అప్పజెప్పారు. ఎన్నికల బాధ్యతల్లో ప్రియాంకది హిమాచల్ తొలి విజయం. దీంతో అన్ని తానై వ్యవహరించిన ప్రియాంకకే సీఎం ఎంపిక బాధ్యత అప్పజెప్పాలని సోనియా డిసైడ్ అయ్యారు. మరోవైపు పరిశీలకులు శనివారం కూడా రాష్ట్ర నేతలతో సమావేశమయ్యారు. ప్రతిభా సింగ్, ముకేశ్ అగ్నిహోత్రి, వీరభద్రసింగ్ కుమారుడు విక్రమాదిత్య కూడా ఈ సమావేవంలో పాల్గొన్నారు. అయితే… వీరభద్రసింగ్ కుటుంబానికే సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్లు మాత్రం బాగా వస్తున్నాయి.












