మనసులో మెదిలిన భావాల్ని చక్కగా కాగితం మీద కాని లేదా ఎదుటి వారికి తెలపడం కాని తెలిపే క్రియను “సంభాషణా చాతుర్యం” అంటారు.. ఇది అందరికీ ఉండదు.. కాని ఇది సాధ్యమే.. దానికి కావాల్సింది కొంచం సాధన.. చాలామంది తమ భావాలను పైకి చెప్పడానికి చాలా ప్రయత్నిస్తారు కాని నోట మాట రాదు. పెదవులు కదలవు. చాలా సతమతమవుతారు.
చెప్పదలుచుకున్న విషయాన్ని చక్కగా వివరించగలిగే శక్తితోనే అనేకమంది విజయాన్ని అందుకున్నారు.. విషయ విజ్ఞానపు గనులుగా వర్ణింపదగిన వ్యక్తులు కొందరు వుంటారు.. కాని తాము చెప్పదలుచుకున్నవి వివరించే శక్తి లేక పోవడం వల్ల వారు సమర్ధవంతంగా ఉపన్యసించలేరు, రాయలేరు, లేదా వుత్తేజపరచలేరు .. చెప్పినవి కొద్ది మాటలే అయినా మీరు ఆత్మవిస్వాసంతో మాట్లాడినప్పుడు లేదా రాసినప్పుడు విన్నవారికి, చూసినవారికి అందరికీ నచ్చుతుంది.. అలా సమర్ధమైన సంభాషణతో మీరు ఇతరులను ప్రభావితం చేయగలిగినప్పుడు అది మీలోని ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది… చాలామంది మాట్లాడుతారు, వారిలో కొద్దిమందే తమ ఆలోచనల్ని అందరికీ చేరువయ్యేలా చెప్పగలుగుతారు .. వారిలో మరికొద్ది మంది మాత్రమే తమ ఆలోచనల్ని ఇతరులపై ప్రభావం చూపేలా వ్యక్తీకరించగలుగుతారు .. వాదించి, ఇతరులను ఓడించి తద్వారా విశ్వాసాన్ని పొందవచ్చునేమో గానీ అది నిజమైన విజయాన్ని మనకు ఎప్పటికీ సాధించి పెట్టలేదు.. ప్రేమతో, ఆప్యాయతతో, మర్యాదగా, ఆహ్లాదాన్ని కలిగించే భాషను ఉపయోగించినప్పుడు అది మనకు ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడమే కాకుండా విజయాన్ని కూడా అందిస్తుంది.. అటువంటి వారు గొప్ప ఉత్తీర్ణత సాధించిన పండితులు కాకపోవచ్చు …. అయినప్పటికీ వాళ్ళు అనేక మంది హృదయాలలో స్థానాన్ని సాధించగలుగుతారు.. వారి మాటల్లోని మయాశక్తి శ్రోతల్ని సమ్మోహితులను చేస్తుంది..
శ్రీరాముడు తన భూభాగంలోకి ఎందుకు వచ్చాడో కనిపెట్టమని సుగ్రీవుడు మహావీరుడైన హనుమంతుణ్ణి గూఢచారిగా పంపాడు.. మొట్టమొదటి సంభాషణలోనే తీయగా, ఊరటకలిగేలా, మర్యాదగా మాట్లాడి హనుమంతుడు శ్రీ రాముడి మనస్సు దోచుకోగాలిగాడు.. సంభాషించడం లో హనుమంతుడి నైపుణ్యాన్ని శ్రీరాముడు వేనోళ్ళ కొనియాడాడు… చాలామంది సంభాషించడం చేత కాక ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి, భయంతో, నిస్పృహకు లోనౌతారు.
మరో ఉదాహరణ : స్వతంత్ర భారతదేశపు మొట్ట మొదటి గృహమంత్రి అయిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ కు ఒక భగీరథ కార్యం ఎదురుగా వుంది.. ఆ కాలంలో భారతదేశంలో 554 సంస్థానాలు వున్నాయి. వాటిని రాజులు, నవాబులు పరిపాలిస్తున్నారు.. “విభజించి పాలించు” అన్నది బ్రిటీష్ వారి రాజనీతి.. పటేల్ గారు దానికి వ్యతిరేకంగా దేశాన్ని సంఘటితం చెయ్యాలని నిశ్చయించుకున్నారు .. 554 మంది పాలకుల్ని ఒప్పించి లోబరుచుకోవడం మాములు పని కాదు కదా.! ఈ మహత్తరమైన కారణం కోసం వారిని ఒప్పించగల శక్తి తనకు వుందని ఆయనలో ఆత్మవిశ్వాసం మెండుగా వుంది.. చక్కగా మాట్లాడి ఒప్పించగల నేర్పు వల్లనే ఆయన ఆ నాడు అంతటి మహత్కార్యాన్ని విజయవంతంగా పూర్తి చెయ్యగలిగారు.. ఒకటి రెండు సంస్థానాలు మినహాయించి ఆయన భావాలను అందరూ అంగీకరించి భారతదేశాన్ని ఒక మహత్తర సంఘటిత శక్తిగా చేసేందుకు తమ సంస్థానాలపై అధికారాన్ని వదిలేసారు..
అంతటి శక్తి వుంది మనం మాట్లాడే, రాసే భావాలపై.. మొదట మీ పై మీకు నమ్మకం, ఆత్మవిశ్వాసం రావాలి.. అది రావాలంటే మీరు తప్పో, ఒప్పో చెప్పాలనుకున్నది, రాయాలనుకున్నది రాసేయ్యడమే.. అలా సాధన జరిగాక మీలోని అద్బుతాన్ని మీరే చూస్తారు.. మహా కవులు ఇలా నిరంతర సాధన ద్వారానే సిద్దులైనారు. కొన్ని వేల కావ్యాలను మనకు అందించగలిగారు. ఇది వారసత్వంగా వచ్చేది కానే కాదు. మన భావాల నుంచి నూతన ఆలోచనల నుంచి ఓ కొత్త ఆవిష్కరణ జరిగే పరిణామక్రమం. మీ ఆలోచనలను లోపల ఎందుకు పెట్టుకుంటారు. తీయండి.. బయటకు తీసి మీరేంటో చూపించండి.. ప్రతీ ఒక్కరు అద్బుతమే.!!
మీ
నందగోపాలమోహనవంశీకృష్ణశర్మ బిదురు