తిరుప్పావై –15 వ పాశురము
బ్రహ్మశ్రీ కంభంపాటి నాగఫణిశర్మ గారి తెలుగు అనువాదముతో
ఎల్లే యిలంగిళియే ! యిన్నమురంగుదియో?
శిల్లెన్రళై యేన్మిన్? నజ్ఞ్గైమీర్, పోదరుగిన్రేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పణ్డేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీజ్ఞ్గళే, నానేదా నాయుడుగ
ఒల్లై నీపోదాయ్, ఉనక్కెన్న వేఱుడైయై ?
ఎల్లారుమ్ పోన్దారో? పోన్దార్, ఫోన్దెణ్ణిక్కొళ్
వల్లానై కొన్రానై మాత్తారై మాత్తళిక్క
వల్లానై మాయనై ప్పాడేలో రెమ్బావాయ్.
తాత్పర్యము…
ఈ పాసురమున లోనున్న గోపికకు, బయటి గోపికలకు సంవాదము నిబంధింపబడినది.
బయటి గోపికలు: ఓ లేత చిలుకవంటి కంఠమాధుర్యము కలదానా! ఇంకను నిద్రించుచున్నావా! అయ్యో ఇది యేమి?
లోని గోపిక: పూర్ణలగు గోపికలారా! చీకాకు కలుగునట్లు జిల్లుమని పిలువకుడు. నేనిదే వచ్చుచున్నాను.
బయటి గోపికలు: నీవు చాల నేర్పు గలదానవు. నీమాటలలోని నైపుణ్యమును, కాఠిన్యమును మేమింతకు ముందే యెరుగుదుము.
లోని గోపిక: ఏ నేర్పుగలవారు. కఠినలు. పోనిండి నేనే కఠినరాలను.
బయటి గోపికలు: నీకీ ప్రత్యేకత ఏమి? అట్లేకాంతముగా నుండెదవేల? వేగముగా వెలికి రమ్ము.
లోని గోపిక: అందరు గోపికలును వచ్చినారా?
బయటి గోపికలు: వచ్చిరి. నీవు వచ్చి లెక్కించుకొనుము.
లోని గోపిక: సరే! నేను వచ్చి ఏమి చేయవలెను?
బయటి గోపికలు: బలిష్ఠమగు కువలయాపీడము అను ఏనుగును చంపిన వాడును, శత్రువుల దర్పమును అణచినవాడును, మాయావియు అగు శ్రీకృష్ణుని కీర్తన గానము చేయుటకు రమ్ము.!!
మీ
నందగోపాలమోహనవంశీకృష్ణశర్మ బిదురు