సీఎం నితీశ్ కు ప్రధాని పదవిపై కన్నుందని, అందుకే కాంగ్రెస్ తో కలిసారన్న బీజేపీ విమర్శలపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ స్పందించారు. తనకు ఏమాత్రం వ్యామోహం లేదని తేల్చి చెప్పారు. తాను ఏమాత్రం హక్కుదారుని కాదని పేర్కొన్నారు. ప్రధాని కావాలన్న కోరిక కూడా తనకు లేదన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో నితీశ్ కుమార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజకీయాలపై చర్చించారు. ఆ తర్వాత సీఎం నితీశ్ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీతో కూడా భేటీ అయ్యారు.
వామపక్ష పార్టీలు, వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ ఏకతాటిపైకి వస్తే అదో పెద్ద విషయం అవుతుందని అన్నారు. ఇక.. సీఎం నితీశ్ తమ పార్టీ కార్యాలయానికి రావడాన్ని తాము స్వాగతిస్తున్నామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ హర్షం వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లోనే ఇదో సానుకూల పరిణామమని అన్నారు. విపక్షాలు కలిసి కట్టుగా దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షిస్తాయని ఏచూరీ పేర్కొన్నారు.