ఢిల్లీ అసెంబ్లీలో గురువారం జరిగిన విశ్వాస పరీక్షలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నెగ్గింది. విశ్వాస పరీక్షలో కేజ్రీవాల్‌కు మద్దతుగా 58 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలు ఉన్నాయి. ఇందులో 62 మంది ఆప్ ఎమ్మెల్యేలు ఉండగా.. బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక… గైర్హాజరైన ముగ్గురు ఆప్ ఎమ్మెల్యేల్లో ఇద్దరు విదేశాల్లో ఉండగా..మూడో వ్యక్తి సత్యేందర్ జైన్ జైలులో ఉన్నారు. ఆపరేషన్ కమలం విఫలమవుతుందని నిరూపించేందుకు ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చామని కేజ్రీవాల్ అన్నారు.
ఆప్ ఎమ్మెల్యేలు ఎవరూ ప్రలోభాలకు లొంగరని..బీజేపీ కుట్రలను అర్థం చేసుకున్నారన్నారు. తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రతిపక్స బీజేపీ పన్నిన ఆపరేషన్ పూర్తిగా విఫలమైందని ఎద్దేవా చేశారు. తమ పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యేను కూడా బీజేపీ కొనుగోలు చేయలేకపోయిందన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలదరూ నిజాయితీపరులేనని, ఒక్క ఎమ్మెల్యే కూడా అమ్ముడు పోలేదని ప్రకటించారు. ప్రధాని మోడీ, సీబీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై దాడి తర్వాత గుజరాత్ లో ఆప్ కు 4 శాతం ఓట్లు పెరిగాయన్నారు. మనీష్ సిసోడియాను అరెస్ట్ తర్వాత అది 6 శాతంకు చేరుకుందన్నారు.