ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నేడు నల్లగొండ జిల్లా పర్యటనకు రానున్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను సందర్శించనున్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం పనులు జరుగుతున్న వీర్లపాలెం గ్రామానికి మధ్యాహ్నం 12 గంటల కల్లా చేరుకుంటారు. సీఎం కేసీఆర్‌ సోమవారం ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్‌ నుంచి బయలు దేరుతారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు వీర్లపాలెం చేరుకుంటారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలిస్తారు. అనంతరం పనుల పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. సీఎం కేసీఆర్ వెంట విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి సహా పలువురు మంత్రులు, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తదితరులు సీఎం వెంట వెళ్లనున్నారు.

 

 

2015 ఆగస్టు 18న ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. రికార్డు సమయంలో 4,676 ఎకరాల భూమిని సేకరించి జెన్‌కోకు అప్పగించారు. 29,992 కోట్ల నిర్మాణ అంచనా వ్యయంతో ఐదు ప్లాంట్ల ద్వారా 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయాలని భావించింది. ఐదు ప్లాంట్లలో రెండు ప్లాంట్ల ద్వారా 2023 సెప్టెంబరు నాటికి విద్యుదుత్పత్తిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ రెండు ప్లాంట్లకు సంబంధించిన టర్బయిన్లు, చిమ్నీల ఏర్పాటు పూర్తయింది. అదే ఏడాది డిసెంబరు వరకు మరో ప్లాంటు, 2024లో నాలుగు, ఐదో ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి ప్రారంభించాలని జెన్‌కో నిర్ణయించింది. నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.