ముఖ్యమంత్రి కేసీఆర్ బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి వారికి కేసీఆర్ దంపతులు 2 కిలోల బంగారు కిరీటాన్ని సమర్పించారు. అనంతరం సీఎం దంపతులను వేదపండితులు ఆశీర్వదించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో సీఎం దంపతుల వెంట స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొన్నారు.

స్వామివారి కరుణ బాన్సువాడ మీద, యావత్ తెలంగాణ ప్రజానీకం మీద ఉండాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. వేంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి కోసం రూ.7 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఆలయం కోసం ఎన్ని చేసినా తక్కువేనని, గుడి అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.23 కోట్లు కేటాయించినట్లు పోచారం శ్రీనివాస్ చెప్పారని, దానికి అదనంగా మరో రూ.7 కోట్ల కేటాయిస్తున్నానని, ఈ నిధులతో గుడిని మరింత అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.
ఇక… సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. సాగు, తాగు నీటి ఇబ్బందులు వుండేవన్నారు. తెలంగాణ ఉద్యమం చేపట్టడానికిగల కారణాల్లో నిజాంసాగర్ నీళ్లు కూడా ఒకటని గుర్తు చేశారు. మరోవైపు బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం 50 కోట్ల నిధులు కేటాయిస్తున్నానని ప్రకటించారు. నిధులు దుర్వినియోగం కాకుండా చూసుకోవాలని కేసీఆర్ సూచించారు.