రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ సందర్భంగా వడగళ్ల వర్షానికి పంట నష్టం అధికంగా జరిగిన 4 జిల్లాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. గురువారం ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో సీఎం పర్యటిస్తారు. ఈ సందర్భంగా నష్టపోయిన పంటల్ని స్వయంగా పరిశీలించనున్నారు. అదే విధంగా చేతికొచ్చిన పంటల్ని పోగొట్టుకొని దుఃఖంలో ఉన్న రైతులకు సీఎం భరోసా ఇవ్వనున్నారు. అయితే… అకాల వర్షాలు కురియగానే… ఓ దఫా వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, మంత్రి సబితా రెడ్డి తదితరులు ఓ దఫా వికారాబాద్ జిల్లాలో పర్యటించారు. పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పారు.
ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పంట దెబ్బ తిన్న ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. దీంతో రైతుల్లో భరోసా కలుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రామడుగు, చొప్పదండి, గంగాధర మండలాల్లో గురువారం సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. అలాగే వరంగల్ జిల్లాలోని దుగ్గొండి మండలం అడవిరంగాపురంతో పాటు పరిసర గ్రామాల్లో వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ గురువారం పరిశీలించనున్నారు. ఈ పర్యటన కోసం అడవిరంగాపురంలో హెలీప్యాడ్ సిద్ధం చేశారు. మహబూబాబాద్ జిల్లాలో
జిల్లాలోని పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాకు గురువారం సీఎం కేసీఆర్ రానున్నారు. వడగండ్లవానతో ఇక్కడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నష్టపోయిన పంటలను పరిశీలించి రైతుల్లో మనోధైర్యం కల్పించేందుకు సీఎం కేసీఆర్ ఈ ప్రాంతంలో పర్యటించనున్నారు.
ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డుమార్గంలో బేగంపేటకు బయలుదేరుతారు.
10.15 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
10.15 గంటలకు హెలిక్యాప్టర్‌లో బయలుదేరుతారు.
11.15 గంటలకు ఖమ్మం జిల్లా బొనకల్ మండలం రామాపురం గ్రామానికి చేరుకుంటారు. దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు.
11.45 గంటలకు రామపురం గ్రామం నుంచి హెలిక్యాప్టర్‌లో సీఎం కేసీఆర్ బయలుదేరుతారు.
12.10 గంటలకు మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంటతండాకు చేరుకుంటారు. దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు.
12.40కి రెడ్డికుంట తండా నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరుతారు.
12.55 గంటలకు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామానికి చేరుకుంటారు. దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు.
మధ్యాహ్నం 1.30 గంటలకు అడవిరంగాపురం గ్రామం నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరుతారు.
1.55 గంటలకు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపురం గ్రామానికి చేరుకుంటారు. రామచంద్రపూర్‌లో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు.
2.30 గంటలకు హెలిక్యాప్టర్‌లో లక్ష్మీపురం గ్రామం నుంచి హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమవుతారు.
3.15 గంటలకు బేగంపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 3.30గంటలకు ప్రగతిభవన్‌కు చేరుకుంటారు.