ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయం ముందు సీఎం కేసీఆర్ దంపతులకు వేద పండితులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబం తరపున ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం కోసం 16 తులాల బంగారాన్ని సమర్పించారు. కేసీఆర్ మనుమడు హిమాన్షు చేతుల మీదుగా సీఎం కేసీఆర్ ఆలయ అధికారులకు బంగారం సమర్పించారు. పూజల అనంతరం కేసీఆర్ కుటుంబ సభ్యులను ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
కుటుంబ సమేతంగా దర్శనానికి వచ్చిన కేసీఆర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ దీవకొండ దామోదర్ రావు, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, సుధీర్ రెడ్డి, జీవన్ రెడ్డి, వైటీడీఏ చైర్మన్ కిషన్ రావు, ఆలయ ఈవో గీతా రెడ్డి ఉన్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ వైటీడీఏ అధికారులతో సమీక్ష జరిపారు. కొండ కింద కొనసాగుతున్న సత్యనారాయణ వ్రత మండపం, బస్ స్టేషన్, గండి చెరువు ఆధునీకరణ పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.