హైదరాబాద్ సంస్థానం ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనుమడు, చివరి నిజాం ప్రిన్స్ మీర్ అలీఖాన్ సిద్దిఖీ ముకర్రంజా బహదూర్ పార్థివదేహానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని చౌమొహల్లా ప్యాలెస్‌లో పార్థివదేహాన్ని సందర్శించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం ప్రార్థించారు. విషాదంలో ఉన్న నిజాం కుటుంబసభ్యులను ఓదార్చారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్యేలు బాల సుమన్, జీవన్‌రెడ్డి తదితరులు వున్నారు. ఎనిమిదో నిజాం ముకర్రంజా పార్థివదేహం హైదరాబాద్‌కు మంగళవారం చేరుకున్నది. టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి ప్రత్యేక విమానంలో భౌతికకాయాన్ని శంషాబాద్‌కు తీసుకొచ్చారు. అక్కడి నుంచి చౌమొహల్ల్లా ప్యాలెస్‌కు తరలించారు. మంగళవారం నిజాం కుటుంబీకులు, బంధువులను మాత్రమే పార్థివదేహాన్ని చూసేందుకు అనుమతిచ్చారు. బుధవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజలు ముకర్రంజా పార్థివదేహాన్ని సందర్శించవచ్చు. అంతిమయాత్ర మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్నది.