తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని, రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు మండిపడ్డారు. అనేక రంగాల్లో దేశంలోనే తెలంగాణనే ప్రథమ స్థానంలో వుందని, వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలోనే వైద్య విద్యకు సరిపడా సీట్లు వున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా హన్మకొండలో ప్రతిమ వైద్య కళాశాలను ప్రారంభించారు. రాష్ట్రానికి 12 కొత్త వైద్య శాలలు తెచ్చుకున్నామని, జిల్లాకో వైద్య కళాశాలను తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
ప్రజల అండదండలతో రాష్ట్రం అగ్రగామిగా వుందన్నారు. రాజకీయాల కోసమే కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చి తనను, మంత్రులను తిట్టి వెళ్తుంటారని, అలా తిట్టిన వారే పైగా ఢిల్లీలో అవార్డులిస్తారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. భారత దేశం గొప్ప సహనశీలత గల దేశమని, ఐకమత్యంతో ముందుకు వెళ్లాల్సిన ఈ దేశంలో విద్వేషాలకు చోటివ్వద్దని కోరారు. ఈ దేశంలో కొద్ది మంది దుర్మార్గులు.. వాళ్ల స్వార్థ, నీచ ప్రయోజనాల కోసం విషబీజాలు నాటే ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఏ రకంగా కూడా సమర్థనీయం కాదని కేసీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ తయారవుతుందన్నారు. ప్రయోగత్మకంగా.. సిరిసిల్ల, ములుగు నియోజకవర్గాల్లో 100 శాతం హెల్త్ ప్రొఫైల్‌ను తయారు చేయడం జరిగిందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ హెల్త్ ప్రొఫైల్ ద్వారా ఒక వ్యక్తికి ఏ రకమైన జబ్బు వచ్చినా.. ఏ రకమైన యాక్సిడెంట్ జరిగినా.. ఒక్క నిమిషంలో డేటా బయటపడుతుందని వివరించారు. 119 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం పూర్తయితే నిమిషంలోనే ప్రతి ఒక్కరి ఆరోగ్య చరిత్ర తెలుస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు.