ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అంతకుముందు కార్యాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత కార్యాలయాన్ని ప్రారంభించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం చాంబర్‌లో కలెక్టర్‌ శశాంకను సీట్‌లో కూర్చుండబెట్టి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్‌ రెడ్డి, ఎర్రబెల్లి దాయకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఎంపీ కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక… ఈ కార్యక్రమానికి ముందు జిల్లాలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించి, పార్టీ జెండాను ఎగరేశారు.