తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండా ఎగరేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. నేటి తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా చిరస్మరణీయులైన ఆనాటి వీరయోధులందరినీ పేరు పేరునా తలుచుకోవడం మన కర్తవ్యం.. వారందరి ఉజ్వల స్మృతికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆనాటి అద్భుత ఘట్టాలు జాతి జనుల యాదిలో నిత్యం ప్రకాశిస్తూనే వుంటాయని పేర్కొన్నారు. తెలంగాణ సమాజాన్ని నిరంతరం ఉద్విగ్నపరుస్తూనే వుంటాయని తెలిపారు. తెలంగాణలో సైతం ఆనాడు ఎందరో యుద్ధం చేశారని, ఇంకొందరు ఆ యుద్ధానికి నాయకత్వం వహించారని అన్నారు. మరికొందరు సాంఘిక, సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించారని, నేటి తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా చిరస్మరణీయులైన ఆనాటి వీరయోధులందరినీ పేరు పేరునా తలుచుకోవడం మన కర్తవ్యం అని సీఎం పేర్కొన్నారు.

నిర్బంధాలకు ఎదురొడ్డి నిలిచిన అక్షర చైతన్య మూర్తులు సురవరం ప్రతాపరెడ్డి, ప్రజాకవి కాళోజి, మగ్దూం మొహియొద్దీన్, షోయబుల్లాఖాన్, బండియాదగిరి, దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతుల రచనల్లోని ఉత్తేజాన్ని, ఉద్వేగాన్ని నిరంతరం నిలబెట్టుకుందామని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇంకా ఎందరో మహానుభావులు, తెలంగాణ సమాజంలో అద్భుతమైన రాజకీయ, సామాజిక చైతన్యాన్ని రగిలించారని పేర్కొన్నారు.

 

 

ఆదిలాబాద్ అడవుల్లో తుడుం మోత మోగించి, అడవిబిడ్డలను ఒక్కటి చేసి, జల్ జంగల్ జమీన్ కోసం సింహగర్జన చేసిన ఆదివాసి యోధుడు కొమరం భీమ్ సాహసాన్ని సగర్వంగా తలుచుకుందామని అన్నారు. భూస్వాముల ఆగడాలకు బలయి పోయిన దొడ్డి కొమురయ్య అమరత్వాన్ని వినమ్రంగా గుర్తు చేసుకుందామని, తన సొంత భూమి వందల ఎకరాలను పేద ప్రజలకు పంచిన త్యాగశీలి, రైతాంగ పోరాటానికి తిరుగులేని నాయకత్వాన్ని అందించిన వీరాగ్రేసరుడు, మొదటి సార్వత్రిక ఎన్నికల్లో నెహ్రూ కన్నా అత్యధిక మెజారిటీని సాధించిన మహా నాయకుడు రావి నారాయణరెడ్డికి ఘనమైన నివాళులర్పిద్దామని తన ప్రసంగంలో సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.