సీఎం కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ విజయవంతం కావాలని, దేశం సుభిక్షంగా వుండాలని ఢిల్లీలో నేడు సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ యాగానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రుత్విక్కులు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ రాజశ్యామల యాగం జరగనుంది. నేడు పుణ్యాహవాచనం, యాగశాల ప్రవేశం, చండీ పారాయణం, మూలమంత్ర జపాలు నిర్వహిస్తారు. బుధవారం నాడు చండీహోమం, రాజశ్యామల యాగం, అనంతరం పూర్ణాహుతి జరగనుంది. శృంగేరిపీఠం గోపీకృష్ణశర్మ, ఫణి శశాంకశర్మ ఆధ్వర్యంలో హోమాలు జరగనున్నాయి.
సీఎం కేసీఆర్‌కు ఢిల్లీ విమానాశ్రయంలో రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, లోక్‌సభలో బీఆర్‌ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు, ఎంపీలు సంతోష్‌కుమార్, దీవకొండ దామోదర్‌రావు, కేఆర్ సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, రంజిత్‌రెడ్డి, పీ రాములు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, పార్థసారథిరెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తదితరులు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఢిల్లీలో బీఆర్‌ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.